Rajagopal Reddy : భట్టికి థాంక్స్ చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. ఎందుకంటే..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. తనకు మంత్రి పదవి రానందుకు అసంతృప్తి తో ఉన్న రాజగోపాల్ రెడ్డి పలు రకాలుగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టాపిక్ పై మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భట్టి... రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం నిజమేనని ...అయితే అది కుదర్లేదు అని చెప్పుకొచ్చారు భట్టి. ఇక భట్టి వ్యాఖ్యల పై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు..అని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు కోమటిరెడ్డి . ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్ ను సైతం ఆయన తన పేజీ లో పోస్ట్ చేశారు. అయితే తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశించారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కష్టమన్న హై కమాండ్ సూచనలతోనే రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్క లేదని సమాచారం. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కూడా గ్యాప్ వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.