RATION CARD: కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం;

Update: 2025-05-16 04:30 GMT

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పలు జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తూ ఈ నెల నుంచే అర్హులైన వారికి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కొత్త కార్డులు మంజూరైన వ్యక్తులకు మొబైల్ ఫోన్‌లకు సందేశాలు పంపించినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం

రేషన్ కార్డు మంజూరు అయిందో.. లేదో తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌కి వెళ్లి ఎడమవైపు ఉన్న FSC Search ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ రేషన్ కార్డు నంబర్‌, జిల్లా వివరాలు నమోదు చేసి సెర్చ్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు కనిపిస్తాయి.

పాత కార్డుల్లో పేరు తొలగించినవారికే కొత్త కార్డు

ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబం నుంచి విడిపోయినవారు కొత్త కార్డులకు దరఖాస్తు చేయాలంటే, ముందుగా పాత కార్డులో తమ పేరు తొలగించుకోవాల్సి ఉంటుంది. తర్వాతే కొత్త కార్డులు మంజూరవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

మీసేవ, ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు

ప్రజాపాలన కార్యక్రమాలు, గ్రామ సభలు, మీసేవ కేంద్రాల ద్వారా చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులన్నీ మండల, జిల్లా స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి. కొంతమందికి కార్డులు మంజూరు కాగా, ఇంకా చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.

సాంకేతిక కారణాలతో ఆలస్యం

కొందరు ప్రజలు మీసేవలో కాకుండా ప్రజాపాలన కార్యక్రమాల్లో మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారి డేటాను పంచాయతీ కార్యదర్శులు యాప్‌లో నమోదు చేస్తుండగా, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలిపారు.

అధికారులను సంప్రదించండి

కొత్త రేషన్ కార్డు ఇంకా రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక మండల కార్యాలయాలు లేదా పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు.

ఇలా తెలుసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు, ప్రజా పాలన కార్యక్రమాలు, గ్రామ సభలు మరియు కుల గణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి కుటుంబ సభ్యుల పేర్లు జోడించబడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ రేషన్ కార్డులో ఉన్న ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News