Kaleshwaram : కాళేశ్వరం 85 గేట్ల నుంచి నీటి విడుదల.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదారమ్మ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 మీటర్లు కాగా, ప్రస్తుతం 15.130 మీటర్లు వుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాళేశ్వరం మేడిగడ్డ 85 గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు వరద నీరు చేరింది. కిన్నెరసానిలో 16 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలిపెట్టారు. 407 అడు గుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 403.30 అడుగులు నీటిమట్టం ఉంది. సాయంత్రానికి ఆరు గేట్లు ఎత్తివేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో మొత్తం 25 గేట్లను ఎత్తి 92,121 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి వరద ప్రభావం వల్ల అక్కడ ఈతవాగు పొంగ డంతో గుంపల్లి చర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండ లంలో గుబ్బలమంగి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో సున్నం బట్టి, కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.