TG : రేవంత్ బరితెగిస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

Update: 2024-07-04 11:31 GMT

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ( Etela Rajender ) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో పదవుల కోసం పరస్పర పోటీ అనేది ఉండదని, అంకితభావంతో పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడం మాత్రమే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. 'మా పార్టీలో ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడ పెట్టాలనేది.. ఏ హోదా కల్పించాలి అనేది.. ఏ బాధ్యత అప్పగించాలి అనేది హై కమాండ్ చూసుకుంటుంది' అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో ఫిరాయింపులపై హాట్ కామెంట్స్ చేశారు ఈటల రాజేందర్. 'ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం అవుతోంది. దానికి తిలోదకాలు ఇచ్చేలా రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారిపోతున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేశారు. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్‌లోని 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 26 మంది పార్టీ మారితే ఆ చట్టం అప్లై కాదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా కండువా కప్పటం అనేది బరితెగించిన పని. ఇది కరెక్టు కాదు'' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

''2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సింది. రకరకాల కారణాల వల్ల అది జరగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 15 శాతం ఓట్లు రాగా.. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు వచ్చాయి'' అని ఈటల తెలిపారు. యావత్ దేశంలో అత్యధికంగా ఓట్ షేర్ సాధించింది బీజేపీ పార్టీ మాత్రమేనని ఈటల అన్నారు. ''ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్‌లో మేం ఎలా అయితే కొట్లాడామో.. వచ్చే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అలాగే కొట్లాడుతాం. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే'' అని ఈటల చెప్పారు.

Tags:    

Similar News