REVANTH: కేసీఆర్‌కు మళ్లీ అధికారం రానివ్వను

శపథం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Update: 2025-12-25 02:30 GMT

ప్రభుత్వం తోలు తీస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నా తోలు తీయడం కాదు.. చింతమడక సర్పంచులే ఆయన తోలు తీస్తారని అన్నారు. చింతమడకలో చీరి చింతకు వేలాడిదీస్తారన్నారు. ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్కా తోలు అంటారా.. ఓ మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడేది ఇదేనా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌, ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వనని రేవంత్‌శపథం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సన్మాన సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను కూడా కింది స్థాయి నుంచి వచ్చానని.. మాట్లాడటం తనకు వచ్చని చెప్పుకొచ్చారు. కొడుకు కేటీఆర్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని గొడవ పెడుతుంటే... తండ్రి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. తానేమి అమాయకులను దుబాయ్ పంపుతానని మోసం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

రెండోసారి వచ్చేది కూడా మేమే

"కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు రాసి పెట్టుకోండి.. ఇదే నా సవాల్‌. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం.” అని రేవంత్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు అయితే.. 2/3 వంతు మెజార్టీతో 80కి పైగా సీట్లతో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఒకవేళ 153 సీట్లయితే.. 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో సారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కొడంగల్‌ బిడ్డగా ఈ గడ్డపై నుంచి శపథం చేస్తున్నా అన్నారు.

అధికారంలోకి రానీయం

బీఆర్ఎస్, కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టాం. పార్లమెంట్‌లో గుండు సున్నా.జూబ్లీహిల్స్ బోరబండలో బండకిందేసి కొట్టినం. పంచాయతీ ఎన్నికల్లో పాతరేశాం. సిగ్గులేకుండా కిందపడ్డా పై కాలు నాదే అన్నట్లు మాటలు మాట్లాడాడు. పుంకనాలు పోటుగాడులా మాట్లాడాడు’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కళ్లు కాంపౌండ్ దగ్గర మాట్లాడినట్లు మాట్లాడకండి. 2029లో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. కేసీఆర్!మీ వయసుకు, మీ అనుభవానికి గౌరవిస్తాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకండి. నువ్వు చెప్పిన అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News