బీజేపీ, బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎన్నికల చట్టాల్లో మార్పుల్ని ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.. గాంధీభవన్‌లో లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మిషన్ వర్క్ షాప్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. కాంగ్రెస్ నేతలకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు..
పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12 వేల ఓట్లను తొలగించారని.. కుటుంబానికి 5 ఓట్లు ఉండే రెండు ఓట్లను డిలీట్ చేశారని రేవంత్ ఆరోపించారు. బూత్‌లు మార్చి ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.. వీటిని ఎదుర్కోవడంలో బూత్ లెవెల్ ఏజెంటే కీలకమని చెప్పారు.. బూత్ వారీగా ఓటర్ లిస్ట్‌ను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు.. ఓటర్ జాబితా సరిగ్గా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లేనన్నారు.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దని.. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పనిచేయాలన్నారు.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ సూచించారు.
ఇతర పార్టీలను ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు రేవంత్ సూచించారు.. గాంధీభవన్ నుంచి గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలన్నారు.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణుల్ని ఎన్నికలకు సంసిద్ధుల్ని చేయాలన్నారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు జులై 18న ట్రైనింగ్ ఉంటుందని.. ఈనెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.