REVANTH: కేసీఆర్‌ది అంతా తప్పుడు ప్రచారమే
దళితులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసింది.. మండిపడ్డ రేవంత్‌రెడ్డి;
సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. దౌల్తాబాద్ నుంచి కోస్గి వరకూ రోడ్‌షో నిర్వహించిన ఆయన, పలుచోట్ల కార్నర్ మీటింగుల్లో మాట్లాడారు. తెలంగాణలో రైతులకు సాగు ఖర్చు బాగా పెరిగిందన్న రేవంత్‌రెడ్డి పెరిగిన ధరల ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలురైతులకు కూడా ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు చొప్పున ఇస్తామన్నారు. సాగుకు ఉచిత కరెంట్ మొట్టమొదటగా అమలు చేసిందే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తుచేసిన రేవంత్‌రెడ్డి కరెంట్, రైతుబంధు విషయంలో కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గెలవగానే 2 లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ పార్టీ ఎన్నికల హామీలను గుర్తుచేశారు.
కొడంగల్‌కు గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్న రేవంత్‌రెడ్డి 9 ఏళ్ల పాలనలో వీధివీధికి బెల్టుషాపులు మాత్రమే తెచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే దౌల్తాబాద్‌లో అభివృద్ధి, సంక్షేమం జరిగిందని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏ హామీని కూడా నెరవేర్చని నేతలు మళ్లీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు కూడా తాను తీసుకొచ్చినవే అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతీ నెలా రూ.2500, రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందజేస్తామని రేవంత్ హామీనిచ్చారు.
ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చాయా?అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.కొడంగల్ నియోజకవర్గానికి రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని మరి ఆ నీళ్లు వచ్చాయా అని ప్రజలను ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారని.. కొడంగల్, మద్దూరుకు రైల్వే లైన్లు వచ్చాయా? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేశారా?’’ అని ప్రశ్నించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో రేవంత్ ప్రచారానికి ముందు బీఆర్‌ఎస్ నాయకుడు, వైస్ ఎంపీపీపై.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సత్యపాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైస్ ఎంపీపీ సతీమణి నిర్మల.. రేవంత్ రెడ్డి ప్రచారం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అందుకు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి క్షమాపణలు తెలిపారు.