పార్టీ ఫిరాయించిన నేతలపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల్లో పదును పెంచారు. కేసీఆర్, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతున్నారు.;
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల్లో పదును పెంచారు. కేసీఆర్, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతున్నారు. హైదరాబాదు నగరానికి తండ్రీకొడుకులు చేసింది ఏమీలేదని విమర్శిస్తూనే.. మెట్రో సిటీని భ్రష్టు పట్టించారని.. మూసీ నది వద్ద కేటీఆర్ నాలుగు గంటలు ఉంటే సమస్యలేంటో తెలుస్తాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ విధానాలపైనా, సీఎం కేసీఆర్ తీరుపైనా వాడీవేడీ వాగ్భణాలు సంధిస్తున్నారు.
మరోవైపు.. పార్టీ ఫిరాయించిన నేతలను టార్గెట్ చేస్తూ రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపోయిన నేతలను రాళ్లతో కొట్టి చంపాలనడం తెలంగాణలో సంచలనంగా మారింది. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. అధికార పార్టీకి అమ్ముడుపోయిన సన్నాసులకు సిగ్గుండాలంటూ ధ్వజమెత్తారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ను ఆయన నివాసంలో కలిసిన రేవంత్ రెడ్డి.. పార్టీ ఫిరాంపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే.. స్పీకర్‌పై చర్యలకు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు అంతేస్థాయిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి గోరంత సమస్యను కొండంతలు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. రేవంత్ కింద పని చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు సిగ్గు పడాలని అన్నారు. వీహెచ్ ఆరోగ్యంగా ఉండి ఉంటే.. ఈ పాటికే రేవంత్ దుమ్మురేపే వారంటూ ఆరోపించారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని దానం నాగేందర్ ధీమా వ్యక్తంచేశారు.
మొత్తానికి జూలై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్‌రెడ్డి.. దూకుడుగా వ్యవహరిస్తుండటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. మరి.. ఈ జోష్ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయతీరాలకు చేర్చుతుందా అనేది వేచి చూడాలి.