Telangana : మిల్లా మ్యాగీ ఆరోపణలపై రేవంత్ సర్కార్ సీరియస్

Update: 2025-05-26 08:15 GMT

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత రెండు రోజులుగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేలా జరుగుతున్న ప్రచారం.. అందుకు తోడు విపక్షాల విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల తీరుపై ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా పరిగణిస్తూ ఆరా తీశారు. ఈ అంశంపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తీవ్ర ఆరోపణలు, తదనంతర పరిణామాలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు గానూ ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, రమా రాజేశ్వరి, సాయిశ్రీలు ఈ కమిటీలో ఉన్నారు.

ధనిక పురుష స్పాన్సర్లను అలరించాలంటూ ఒత్తిడి చేశారంటూ మిల్లా సంచలన వ్యాఖ్యల నేపత్యంలో ఈ కమిటీ సోమవారం నుంచి విచారణ మొదలు పెట్టనుంది. పోటీల్లో పాల్గొన్న ఇతర యువతులను కూడా విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేయనుంది. అవసరమైతే వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. మిల్లా మాగీ ఆరోపణల్లో వాస్తవమెంత? పోటీల సందర్భంగా నిర్వాహకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కావడంతో, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. విచారణలో భాగంగా మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ల నుంచి కూడా వివరాలు సేకరించారు. మిల్లా మాగీ హాజరైనట్లు చెబుతున్న విందు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఆ రోజు ఆమెతో సన్నిహితంగా ఉన్నవారు ఎవరు అనే వివరాలను కూడా కమిటీ సేకరిస్తోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది. అయితే, మిల్లా మాగీ చేసిన ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవి నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. దర్యాప్తు పూర్తయితే గానీ ఈ ఆరోపణల్లో నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

Tags:    

Similar News