REVANTH: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి మద్దతు
రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు
తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలి లిల్లీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిన్ జాన్సన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెలో టుకర్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్లో పరిశ్రమ ఏర్పాటుకు ఎలి లిల్లీ ముందుకొచ్చింది. రూ.9 వేల కోట్లతో ప్లాంటు, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థను సీఎం అభినందించారు. ఫార్మా పాలసీని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని.. అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని వెల్లడించారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు.
రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు
హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లకు అమ్ముడుపోయింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంపాటలో 7.67 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. మొత్తం రూ.1357 కోట్లతో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 7.67 ఎకరాల భూమిని దక్కించుకుంది. టీజీఐఐసీ చరిత్రలో ఇదే రికార్డు ధర కావడం గమనార్హం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న 18.67 ఎకరాల భూమికి టీజీఐఐసీ సోమవారం వేలంపాట నిర్వహించింది. ఈ మొత్తం భూమిని రెండు భాగాలుగా విభజించింది. 7.67 ఎకరాలను ఒక భాగంగా, 11 ఎకరాలను మరోభాగంగా ఏర్పాటు చేసి వేలంపాట నిర్వహించింది. 11 ఎకరాలను రూ.1,556.5 కోట్లకు ప్రెస్టేజ్ రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుంది. ఎకరానికి రూ.141.5 కోట్లు చొప్పున ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వేలం పాడింది. ఎకరా కనీస ధర రూ.101 కోట్లుగా టీజీఐఐసీ నిర్ణయించగా.. ఇందులో పలు సంస్థలు పాల్గొన్నాయి. 2017లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో నిర్వహించిన వేలం పాటలో ఎకరం ధర రూ.42.59 కోట్లు పలకగా.. 2022లో నియోపోలిస్, కోకాపేటలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో ఎకరం భూమి రూ.100.75 కోట్లు పలికింది.