తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా రైతు రుణమాఫీ మార్గదర్శకాల ఉత్తర్వులను తెలుగులో జారీ చేయడం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని, రైతులు కూడా తమ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి జారీ చేసిన మార్గదర్శకాలకు సార్థకత లభిస్తుందని తెలిపారు.
ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు, ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వెంకయ్యనాయుడు ప్రశంసపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేశామని, దీనిపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ ట్వీట్ చేశారు.