REVANTH: జూబ్లీహిల్స్ లో మాపై కుట్ర జరుగుతోంది: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్-బీజేపీలు ఒక్కటయ్యాయి.. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం.. కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్న విపక్షాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని 22 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి? ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది? ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలన్నారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం
తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కారణం ఈ రెండు పార్టీలేనని రేవంత్ ధ్వజమెత్తారు. ఈ కుట్రలన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఇవాళ ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నాయని ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా మారిందని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ఆరోపించారు. 1990లో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని సీఎం రేవంత్ అన్నారు. 35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన కార్యక్రమం జరుగుతుందన్నారు. గత పాలకులు అనుమతులు ఇవ్వకున్నా పోరాడామని చెప్పారు. మతతత్వ వాదులు గాంధీని చంపేశారని.. గాంధీని చంపిన వాళ్లు బ్రిటీష్ వాళ్లకంటే ప్రమాదమన్నారు రేవంత్. దేశ సమగ్రతను కాపాడటంతో ఇందిరా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించారని రేవంత్ తెలిపారు.
దేశానికి పర్యాయపదం "గాంధీ"
‘రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గాంధీ అనే పదం ఈ దేశానికి పర్యాయ పదం. అన్ని మతాల సహజీవనం ఎలా స్పూర్తి ఇస్తుందో.. గాంధీ అనే పదం కూడా అదే స్పూర్తినిస్తుంది. గాంధీని బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజుల్లోనే మతతత్వ వాదులు గాంధీని హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే మతతత్వ వాదులు ప్రమాదకరం అని గుర్తు పెట్టుకోవాలి. దేశం కోసం మొదటి తరం గాంధీ.. రెండో తరం ఇందిరా గాంధీ.. మూడో తరం రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
21 ఏళ్లకే ఎమ్మెల్యేగా...
దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీచేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో తెలంగాణలో రెజల్యూషన్ తీసుకువస్తామని చెప్పారు. ఈ విషయంలో పార్లమెంటులో చట్టసవరణ చేస్తే రాజకీయాల్లో యువత మరింత క్రియాశీలకంగా మారుతుందని చెప్పారు. ‘రాజీవ్ గాంధీ స్పూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మతసామరస్యం కాపాడుతాం అని చార్మినార్ ముందు రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. చెప్పినట్టుగానే కుల గణన చేశాం. 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ పోయింది. ఆ 8 సీట్లలో బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. పార్లమెంట్‌కి వచ్చే సరికి ఇటు పోయాయి. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కూడా కుట్ర జరుగుతుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సీఎం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ రెడ్డి, వీహెచ్, ఏఐసీసీ నేత సల్మాన్ ఖుర్షీద్ పాల్గొన్నారు.