REVANTH: ఇదీ.. రేవంత్ మార్క్ విజయం
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం... ముందుండి నడిపిన సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. అభ్యర్థి ఎంపిక నుంచి చివరి రోజు ఓటింగ్ రోజు చివరి గంట వరకు ప్రత్యేకంగా సమీక్షించారు. ఎన్నిక ఏదైనా తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటానని ముందు చెప్పినట్టుగానే రంగంలోకి దిగిన రేవంత్ పార్టీని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటయ్యాక మొదటి, చివరిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయం హస్తం చేజిక్కింది. ఇక్కడ పార్టీ కేడర్ అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఉపఎన్నిక రావడంతో మొదట్లో సర్వేలన్నీ బీఆర్ఎస్కే మొగ్గు చూపాయి. అందుకే సీఎం ఈ ఉపఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను తిప్పికొడుతూ పక్కా వ్యూహరచనతో సక్సెస్అయ్యారు. అభ్యర్థి ఎంపిక నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకూ అన్ని అంశాల్లో రేవంత్ తనదైనశైలిలో బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆయన జూబ్లీహిల్స్‌లోనూ బీసీ అభ్యర్థినే నిలిపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి చక్రం తిప్పారు.
ఈ జోష్‌తో ఆయా ప్రాజెక్టులను సీఎం రేవంత్మరింత వేగంగా ముందుకుతీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ఘన విజయం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక ప్రణాళిక ఎంతగానో పనిచేసిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. మంత్రి వివేక్‌వెంకటస్వామికి జూబ్లీహిల్స్ప్రచార బాధ్యతలను జూన్చివర్లోనే సీఎం రేవంత్ అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడ్తూ.. నియోజకవర్గంలో గల్లీగల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలు గుర్తించి, పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం మీ వెంట ఉందనే భరోసాను వివేక్ వెంకటస్వామి కల్పించారు. మంత్రి వివేక్‌కు తోడుగా ఆగస్టులో మరో ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ముగ్గురూ కలిసి వివిధ వర్గాలతో వరుస భేటీలు జరుపుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్పెంచారు.
స్థానిక సమరంపై కాంగ్రెస్ గురి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోశాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఛేజిక్కించుకోవడానికి రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 3 నెలలుగా క్షేత్ర స్థాయిలో ముగ్గురు మంత్రులు, పార్టీ నాయకులు చేసిన కృషి ఫలితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయంగా చెప్పవచ్చు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపతాకాన్ని ఎగురవేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా పాతింది. మూడుసార్లు బీఆర్ఎస్ గెలుపొందిన జూబ్లీహిల్స్ స్థానాన్ని హస్తం పార్టీ వశం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వ్యూహాలకు ప్రజానుకూల ఫలితం వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని ఆ పార్టీ చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తోంది. రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని ప్రతిబింభిస్తోందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.