రాష్ట్రంలో మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు అందరిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో 60% పైన ప్రజలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మూసీ వెనుక మూటల దోపిడీ ఉందని దుయ్యబట్టారు. రేవంత్ ఈ ఏడాది పాలనలో అదానీ, బావమరిది, బ్రదర్స్ కోసమే పనిచేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు తీయకుండా రేవంత్‌కు గానీ కాంగ్రెస్ నేతలకు గానీ పూట గడవదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది కాలంలో తమ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఎన్నికల ఫలితాలతో ఎవరెవరు ఎలాంటి వారో తెలిసిందన్నారు. కేసీఆర్ తమకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఆయన ఫామ్‌హౌస్‌కు పరిమితం కాలేదని, అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి కేసీఆర్‌ను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.