TG: పేదోడి కంచంలో "సన్న బియ్యం" బువ్వ
రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం.. ఏటా రూ. 2,858 కోట్ల ఖర్చు పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం;
నిరు పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సన్న బువ్వతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో ఉగాది నుంచే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి రేవంత్ ప్రభుత్వం.. ప్రతి ఏటా సుమారు రూ.2,858 కోట్ల ఖర్చు పెట్టనుంది.
దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. అంతేకాదు సన్నాలను ప్రోత్సహిస్తూ రైతలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. గడిచిన సీజన్లో సన్నాలకు రూ.1.199 కోట్ల బోనస్‌ను రైతుల ఖాతాలో జమ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాల పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం
గత పదేళ్ల నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందజేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. రేషన్ కార్డు లేకున్నా.. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారని అన్నారు. అందుకే సన్న బియ్యం పంపిణీ చేయాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
సన్న బియ్యంతో అక్రమాలకు అడ్డుకట్ట
ఒకప్పుడు చాలా మందికి రేషన్ బియ్యమే ఆధారం. కానీ ఇప్పుడు అత్యంత నిరుపేదలకు కూడా రేషన్ బియ్యాన్ని తినడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేయడమే దీనికి ప్రధాన కారణం. రేషన్ దుకాణాల నుంచి బియ్యం తీసుకొని వాటిని కేజీకి రూ.10 చొప్పున వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఆ దొడ్డు బియ్యాన్ని రిసైక్లింగ్ చేసి కొందరు కోట్లు సంపాదిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సన్నాలను సాగు చేయాలని పిలుపునిచ్చింది. సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.