హైదరాబాద్ మెహదీపట్నం రేతిబౌలిలోని సింధు మహిళా కాలేజ్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల బకాయి ఫీజులతో పాటు స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని.. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థుల బకాయి ఫీజులు చెల్లించ లేనిపక్షంలో ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ.. విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు డబ్బులు లేవా అని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం 10 నెలల పాలనలో ఏం ఖర్చు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.