SAUDI: 45 మంది హైదరాబాదీల సజీవ దహనం
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..45 మంది మృతి.. ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబాలు.. డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు
సౌదీలోని పవిత్ర మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ముఫ్రిహత్ వద్ద జరిగిన ఈ భయానక అగ్నిప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో దాదాపు 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారని.. మరణించిన అందరూ తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందినవారేనని అధికారులు వెల్లడించారు. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్ను బస్సు ఢీకొనగానే.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.
మృతుల వివరాలు..
మృతుల్లో రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మెహదీపట్నం ఫ్లైజోన్ ఏజెన్సీ ద్వారా నిర్వాహకులు టికెట్లు బుక్ చేశారు. ఈనెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయల్దేరారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కి.మీ దూరంలో బస్సు-డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.
సచివాలయంలో కంట్రోల్ రూం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మరణించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడంతో.. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణ ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాల కోసం సచివాలయంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మక్కాకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు వివరాల కోసం79979 59754, 99129 19545 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.