SC: బీసీ రిజర్వేషన్లపై నేడే సుప్రీంకోర్టులో విచారణ
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూతాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ సమావేశమై బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ పై చర్చించారు. బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై సమాలోచనలు చేశారు. సీఎంతో భేటీ తర్వాత ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‌తో భట్టి విక్రమార్క, మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, తాజా పరిస్థితులను మీనాక్షికి వివరించారు.
తెలంగాణ హైకోర్టులోనూ విచారణ
బీసీ రిజర్వేషన్లను చాలెంజ్ చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ విచారణలో ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ విషయంలో లీగల్‍గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆసక్తి నెలకొంది. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది? వాటిని ఎలా అధిగమించాలి, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఎలాంటి వాదనలు వినిపించాలి అనే విషయాలను అంశాలను ఇవాళ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. ఒక వేళ రిజర్వేషన్ల అమలుకు కోర్టు నుంచి అనుమతి లభించకపోతే పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉన్న నేపథ్యంలో నేడు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.