SC: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట.... తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో విచారణ... పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని పిటిషనర్ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీంతో తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని ఆయన బదులిచ్చారు. దీంతో అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో, పిటిషనర్ తరపు న్యాయవాది తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణ హైకోర్టులో జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆశలుపెట్టుకుంది. హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ విచారణలో ఉన్నందున, అత్యవసరంగా జోక్యం చేసుకుని జీవో అమలుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు విచారణతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా వాయిదా పడతాయా అన్నది తేలాల్సి ఉంది.
పిటిషన్లో ఏముందంటే...?
స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని గోపాల్ రెడ్డి తన పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్‌ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఈ పిటిషన్లో మాధవరెడ్డి, తీన్మార్ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నంబర్ 9 జారీ చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. దీనిని సామాజిక న్యాయంగా వర్ణించింది. ఈ జీవో ఆధారంగా రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసింది. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ పట్టుదలగా ఉంది.