మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడు అథియాన్ అదృశ్య ఘటన విషాదాంతమైంది. ఇటీవల దీక్షిత్ ఘటన మరువకముందే మరోసారి బాలుడి హత్య కలకలం రేపింది. శామీర్‌పేట అవుటర్ రింగ్‌రోడ్డు పక్కన బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శామీర్‌పేటకు చెందిన సయ్యద్ ఉసేన్, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 15న మధ్యాహ్న భోజనం తరువాత ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ బయట పడింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్న సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఇంటిలో వేరే పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న బీహార్‌కు చెందిన యువకుడితో కలిసి అధియాన్ షేర్‌చాట్ వీడియో షూట్‌కు వెళ్లినట్టు గుర్తించారు.. ఓ బిల్డింగ్ పై దూకినట్టు యాక్ట్ చేస్తున్న సమయంలో అధియాన్ ప్రమాదవశాత్తూ కింద పడి.. తలకి గాయమై మృతి చెందాడు. దీంతో బాలుడి గాయాల సంగతి ఇంట్లో తెలిస్తే తిడాతరని.. ఆ యువకుడు బాలుడ్ని హత్య చేశాడు. ఎవరూ గుర్తించకుండా.. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పొదల్లో మూట గట్టి పడేశాడు.
బాలుడ్ని హత్య చేసిన తరువాత ఆ యువకుడు తాను దొంగలించిన ముబైల్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ చేశాడు. 15 లక్షల రూపాయాలు ఇస్తే.. అధియానాను వారి కుటుంబానికి అప్పగిస్తానని బెదిరించాడు. దీంతో ఇంటి యజమాని, బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. బాలుడిని చంపి 11 రోజులు గడవడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలుడి అదృశ్యం రోజే పోలీసులకు.. ఫిర్యాదు చేశామని.. వారు పట్టించుకోకపోవడంతో బిడ్డ చివరి చూపు దక్కలేదని అధియాన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.