జమిలి ఎన్నికలతో దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచేలా ప్రధాని మోడీ నాయకత్వంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై హైలెవల్ కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని బుధవారం బండి సంజయ్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో క్రమబద్ధమైన, సమర్థవంతమైన పాలన దిశగా దేశం మరో ముందడుగు వేసినట్లయిందని తెలిపారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట, ఏదో ఒక ఎన్నిక అనే తంతుకు స్వస్తి పలికిట్లయిందన్నారు. దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ, తర్వాత 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు జరపడానికి కేంద్రం కేబినెట్ అంగీకరిస్తూ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిఫార్సులకు ఆమోదం తెలపడం శుభపరిణామమని చెప్పారు. దీనివల్ల చట్టబద్ధంగా ఎన్నికైన నాయకులు పాలనపై, అధికారులు విధులపై దృష్టి సారించడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఏకకాలంలో, క్రమబద్ధంగా, సమర్థవంతంగా జరిగే ఎన్నికలకు త్వరలోనే దేశం సాక్ష్యంగా నిలుస్తుందని గర్వంగా చెబుతున్నానని బండి సంజయ్ అన్నారు.