Singareni CMD Balram : పర్యావరణ యజ్ఞం ఆపని సింగరేణి సీఎండీ

Update: 2024-12-16 10:00 GMT

తెలంగాణ ట్రి మ్యాన్ అవార్డు గ్రహీత, సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్ పర్యావరణ యజ్ఞంలో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆదివారం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 209 మొక్కలను నాటారు. దీంతో ఇప్పటి వరకు ఆయన నాటిన మొక్కల సంఖ్య 18,500కి చేరింది. దేశంలో ఓ ఉన్నతాధికారి ఇంత భారీసంఖ్యలో మొక్కలు నాటిన ఘనత సింగరేణి సీఎండీకే దక్కుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్బన ఉద్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్కు దారి తీస్తున్న క్రమంలో వరదలు, కరవు లాంటి ప్రకృతి విపత్తులు తరచూ సంభవిస్తున్నాయని, ఇకనైనా మానవాళి మేల్కొని గ్రీనరీని పెంచడం ద్వారా భూమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను స్వయంగా ఇప్పటివరకు ఆరు జిల్లాలలో 40 ప్రాంతాల్లో మొక్కలను నాటానని ఇందులో 35కిపైగా ప్రాంతాలు మినీ ఫారెస్టులుగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. తాను నాటిన మొక్కల్లో 90 శాతంపైగా వృక్షాలుగా మారడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలని, వాటిని పెంచాలని సూచించారు. సింగరేణి సీఎండీ బలరామ్ ఐదేళ్ల కిందట (2019 జూన్ 5న) మొక్కలు నాటే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం బంగ్లాస్ ఏరియాలో 108 మొక్కల్ని నాటారు. అప్పటి నుంచి ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 18,291 మొక్కలు నాటారు. ఆదివారం ఆయన సింగరేణి ధర్మాలు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడి ఖాళీప్రదేశంలో మరో 209 మొక్కలు నాటి 18,500 మైలురాయిని చేరుకున్నారు. తాను నాటిన మొక్కల ప్రదేశాలను జియో టాగింగ్ చేశారు. నిత్యం వాటిని పరిశీలిస్తుంటారు.

Tags:    

Similar News