muchintal : శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతున్న దివ్యసాకేతం..!
muchintal: ఎటుచూసినా భక్తజనం... ఎక్కడా విన్నా అష్టాక్షరీ మంత్రం. ముచ్చింతల్ శ్రీరామనగరం... భూవైకుంఠంలా మారిపోయింది.;
ఎటుచూసినా భక్తజనం... ఎక్కడా విన్నా అష్టాక్షరీ మంత్రం. ముచ్చింతల్ శ్రీరామనగరం... భూవైకుంఠంలా మారిపోయింది. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో భాగంగా లక్ష్మీనారాయణ మహాయజ్ఞం పదకొండో రోజుకు చేరుకుంది. యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. పండితుల బృందం చతుర్వేద పఠనం చేపట్టారు.
రామానుజ సహస్రాబ్ది సమారోహం పదకొండో రోజు కూడా వీవీఐపీలు పలువురు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు దివ్యసాకేతం సందర్శించారు. ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దివ్యసాకేతానికి వచ్చారు. 108 దివ్యదేశాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.... సమతా మూర్తి విగ్రహాన్ని వీక్షించారు. అటు తర్వాత యాగశాల ప్రాంగణానికి వెళ్లిన ఉపరాష్ట్రపతి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. వేదిపండితులు వేద ఆశీర్వచనం చేశారు.
వెయ్యేళ్ల కిందటే వివక్షకు వ్యతిరేకంగా సానుకూల విప్లవానికి రామానుజాచార్యులు నాంది పలికారన్నారు ఉపరాష్ట్రపతి. సామాజిక సంస్కరణల అభిలాషిగా పేర్కొన్నారు. కులం కన్నా గుణం మిన్న అని ఆనాడే రామానుజులు చాటి చెప్పారన్నారు. కాగా భీష్మ ఏకాదశి సందర్భంగా యాగశాలలోని పెరుమాళ్‌కు ప్రత్యేక పూజలు, సువర్ణపుష్పాభిషేకం జరిపారు. ఉదయం నుంచి శ్రీనారసింహ స్తోత్రాలు, విష్ణు సహస్రనామ పారాయణలు చేశారు. యాగంలో భాగంగా తీవ్రవ్యాధుల నివారణకై పరమేష్టి, పితృదేవతా తృప్తిద్వారా విఘ్న నివారణకై వైభవేష్ఠి జరిపించారు చినజీయరు స్వామి. అనంతరం విజయప్రాప్తికై విష్వక్సేనేష్ఠి, జ్ఞానజ్ఞానకృత సర్వ విధపాప నివారణకై శ్రీమన్నారాయణేష్టి నిర్వహించారు.
యాగశాల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీవైష్ణవ పర్వదినాల్లో భీస్మ ఏకాదని ముఖ్యమైన తిథి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 1 44 యాగశాలల దగ్గర భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పూర్ణాహుతి అనంతరం చినజీయరు స్వామివారితో పాటు మరో పదిమంది జీయరు స్వాములు యాగశాల పరిక్రమణ చేశారు. స్వాములవెంట అశేష భక్తవాహిణి ముందుకు కదిలింది. చినజీయరు స్వామి మంత్రోచ్ఛరణ చేస్తుంటే... భక్తులు గళం కలుపుతూ ముందుకు సాగారు.అటు ప్రవచన మండపంలో రామానుజులవారు జాతికి ఇచ్చిన సందేశంపై పలువురు వక్తలు ప్రసంగించారు. డాక్టర్ శోభారాజ్ అన్నమయ్య గీతాలతో అలరించారు. సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు కొనసాగాయి. జూపల్లి ఈడ్య నాట్య బృందం ఇచ్చిన ప్రదన్శన హైలైట్‌గా నిలిచింది.
పన్నెండు రోజుల రామానుజ సహస్రాబ్ది సమారోహం ఆదివారంతో ముగియనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక అతిథిగా శ్రీరామనగరానికి విచ్చేయనున్నారు. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కేజీల బంగారు శ్రీరామానుజ మూర్తిని ఆవిష్కరిస్తారు.