రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మహిళలకు రూ.2,500 సాయం, పెన్షన్ల పెంపు, ఇతర అంశాల ప్రస్తావన ఈ బడ్జెట్ లో లేదని ఆయన మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా.. మహిళలకు ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కోటి మంది మహిళలు నెలకు రూ.2,500 సాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. పెన్షన్లు రూ.4వేలకు పెంచుతామని ఇప్పటికీ పెంచలేదన్నారు. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5లక్షల విద్యా భరోసా కార్డులు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అందరినీ కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో గొప్పలకు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు బడ్జెట్ లో ఆ ప్రస్తావనే తీసుకురాలేదని విమర్శించారు. హడావుడిగా అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారని.. ప్రస్తుతం ఆరు గ్యారంటీల ఊసే ఎత్తడం లేదన్నారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల టైమ్ లో చెప్పిన కాంగ్రెస్.. బడ్జెట్ లో ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు..