తెలంగాణలోని పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఒక వింత సమస్య ఎదురవుతోంది. సొంత స్థలం ఉన్న నిరుపేదలు నిర్మించుకుంటున్న ఇళ్ల విషయంలో ప్రభుత్వం పెట్టిన కొలతల గీత దాటితే వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. సరైన అవగాహన లేక.. ఉన్నంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇది పెద్ద షాక్‌గా మారుతోంది. లభిదారులకు అధికారులు ముందుగా ఇంటి నిర్మాణంపై స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
ప్రభుత్వం మొదట్లో చెప్పిన దాని ప్రకారం.. సొంత జాగా ఉన్న పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు. దీని కోసం ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే కొంతమంది లబ్ధిదారులు ఈ నిబంధనను సరిగ్గా తెలుసుకోలేకపోయారు. తొందరపాటులో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు వారికి మొదటి విడతగా వచ్చే లక్ష రూపాయలు నిలిచిపోయాయి. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కట్టుకున్నవారు పేదవారు కారని, వారికి ఈ పథకం వర్తించదని అధికారులు తేల్చి చెబుతున్నారు.