దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లోని రైతు బజార్‌లలో ప్రస్తుతం లోకల్, హైబ్రిడ్ రకాల టమాటా కిలో 39కి లభ్యమవుతోంది. రిటైల్ దుకాణాల్లో కిలో రూ.50-60కి విక్రయిస్తున్నారు.
జూన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘఢ్‌లో సాగు చేసిన టమాటా పంట దెబ్బతింది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అయ్యే టమాటా రేట్లను కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. జనవరి నుంచి మార్చి వరకు కిలో టమాటా ధర 10 నుంచి 20 మాత్రమే ఉండేది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుమతి తగ్గిందంటూ రేట్లను భారీగా పెంచేశారు. ఏప్రిల్‌లో కిలో రూ.35 ఉన్న టమాటా రేటు జూలైకి వచ్చేసరికి రూ.150 దాటింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజుల క్రితం రూ.180కి కూడా విక్రయించారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న కొందరు కమీషన్ ఏజెంట్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను నిలువునా దోచుకున్నారు. అయితే వర్షాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు కొత్త పంట చేతికి రావడంతో టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.