ACB: ట్రంకు పెట్టె నిండా నోట్ల కట్టలు
మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో ACB తనిఖీలు... భారీగా అక్రమాస్తులు గుర్తింపు....
తెలంగాణలో అక్రమాస్తులు కూడగట్టిన ఓ అవినీతి తిమింగళం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో ACB అధికారులు జరిపిన సోదాల్లో.. 2 కోట్ల ఏడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహేందర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట భారీగా స్థిర, చరాస్తులు గుర్తించారు. వాటి విలువ 4 కోట్ల 57 లక్షల ఉంటుందని అంచనావేశారు. ఆదాయానికి మించిఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డి ఇంట్లో అధికారులు శనివారం తెల్లవారుజామునే సోదాలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో ఓ ట్రంకు పెట్టెలో దాచిన నగదును గుర్తించారు. ఆ పెట్టెను వెల్డర్ సాయంతో తెరిచి అందులోని నగదును లెక్కించారు. అందులో 2కోట్ల 7లక్షల రూపాయలున్నట్టు తేలింది. గతంలో కందుకూరు తహసీల్దార్ గా పనిచేసిన మహేందర్ రెడ్డిపై ఫిర్యాదులు రాగా..... ACB అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లల్లో కూడా ACB అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో కిలోకు పైగా బంగారం కూడా దొరికినట్టు సమాచారం. మహేదర్‌రెడ్డి స్థిరాస్తి వ్యవహారాలు సైతం నడిపిస్తున్నాడని ఏసీబీ భావిస్తోంది. మరోవైపు అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లతో పాటు మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయంలోనూ అనిశా అధికారులు తనిఖీలు చేశారు.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తహసీల్దార్‌గా పనిచేస్తున్న మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వెలిమినేడు గ్రామం. తొలి పోస్టింగ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేసి తహసీల్దార్‌గా పదోన్నతి పొందాడు. కందుకూరు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన మహేందర్‌రెడ్డి రెండు నెలల కిందట నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌గా బదిలీ అయ్యాడు. అతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందింది. దాంతో అనిశా అధికారులు.... హైదరాబాద్‌లో హస్తినాపురం, శిరిడీసాయినగర్‌లలోని. మహేందర్‌రెడ్డి నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోదాలు ముగిశాక మహేందర్‌రెడ్డికి వైద్య పరీక్షలు చేయించిన అనిశా అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.