తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులపై అసంతృప్త జ్వాలలు చల్లారడం లేదు. బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై మాజీ మంత్రి చంద్రశేఖర్ గుర్రుగా ఉన్నారు. నిన్న వరంగల్‌లో ప్రధాని మోదీ సభకు సైతం దూరంగా ఉన్నారు. సంజయ్ తొలగింపును బహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. చంద్రశేఖర్ బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని బుజ్జగించారు.
ఎస్సీ వర్గీకరణపై బీజేపీ నిర్ణయం తీసుకోవాలని ఈటల రాజేందర్‌ను కోరారు మాజీ మంత్రి చంద్రశేఖర్. వర్గీకరణ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఈటల హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ బీజేపీని వీడతారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్‌ను గద్దె దించాలన్న కామన్ ఎజెండాతో. చంద్రశేఖర్, తాము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఏబీసీడీల వర్గీకరణపై బీజేపీ అధ్యయనం చేస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉందన్నారు. బీజేపీని నేతలు వీడతారన్నది అవాస్తవమన్నారు. చంద్రశేఖర్‌ను బుజ్జగించడానికి రాలేదని.. ఆయనే తమకు మార్గదర్శకుడని చెప్పారు.