Telangana Budget 2022: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు.. అదేనా కారణం..?

Telangana Budget 2022: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా అనే ఉత్కంఠకు తెరదించింది తెలంగాణ ప్రభుత్వం.

Update: 2022-03-02 12:00 GMT

Telangana Budget 2022: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా అనే ఉత్కంఠకు తెరదించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఇదే సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం కేసీఆర్‌.

మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే వీటిలో తొలి రోజు గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు‌. బడ్జెట్‌ ఆమోదంపై మార్చి 6న రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. మార్చి 7న ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోడానికి కారణం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సీఎం కెసిఆర్ కు మధ్య గత కొద్ది కాలంగా గ్యాప్ రావడమేననే టాక్ వినిపిస్తోంది. క్యాబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో వివాదం మొదలైందట. ఇక రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.

మేడారం జాతరలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం, అధికారులు గవర్నర్ కు స్వాగతం పలకకపోవడంతో కలెక్టర్, ఎస్పీల తీరు వివాదాస్పదం అయింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అసెంబ్లీని సమావేశ పరచాలని గవర్నర్ ను కలవడం ఆనవాయితీ. ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది.

బడ్జెట్ స్పీచ్ ను క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ కు పంపించాలి. మరి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతారా అంటూ జోరుగా చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్ కు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్తారా లేక మంత్రులకు చెప్తారా? అనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది.

ఇక శాసనమండలి చైర్మన్ నియామకంపై సైతం గవర్నర్ ప్రశ్నలు గుప్పించారు. పూర్తి స్థాయి చైర్మన్ ను మండలికి ఎందుకు నియమించడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గవర్నర్ తమిళి సై. గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన తర్వాత భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్ గా నియమించారు. ఏడాది కాలంపాటు భూపాల్ రెడ్డి కొనసాగిన తర్వాత ఇటీవలే ఆయన స్థానంలో జాఫ్రీని ప్రొటెం చైర్మన్ గా నియమించారు.

మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి ఛైర్మన్ గా నియమిస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారికి మండలి ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇంతవరకు మండలి ఛైర్మన్ నియామకం జరగలేదు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నా.. మండలికి పూర్తిస్థాయి చైర్మన్ నియామకంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో గవర్నర్ ప్రశ్నించినా.. సీఎం ఎటూ తేల్చకపోవడంతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు తమ పరిధిని మించి వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News