SAD: కొండపోచమ్మ విషాదంపై ప్రముఖుల ఆవేదన
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... సంతాపం తెలిపిన మాజీ సీఎం కేసీఆర్;
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకు దిగి అయిదుగురు యువకులు మరణించడంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండగ ముందు యువకులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు గల్లంతవడంపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ అన్నారు.
చాలా బాధాకరం: కేసీఆర్
కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగపూట ఐదుగురు యువకులు మరణించడం బాధాకరం అన్నారు. యువకుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి
కొండపోచమ్మ సాగర్‌లో మునిగి ఐదుగురు మృతి చెందిన విషాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చేతికి అందొచ్చిన పిల్లలు.. ఇలా అకాల మరణం చెందడం తీరని లోటన్న ఆయన.. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్ సంతాపం
కొండపోచమ్మ సాగర్ మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యుక్త వయసులో యువకుల అకాల మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. వారి కుటుంబాలకు కలిగే తీరని లోటును ఎవరూ పూడ్చలేరు అని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంలో ఉన్న యువకుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు X లో ట్వీట్ చేశారు.
మృతులను ఆదుకోవాలి'
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడంపై BRS MLC కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు రిజర్వాయర్ వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.