TPCC: నేడు కాంగ్రెస్ నేతల కీలక భేటీ
ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి రేవంత్ బృందం;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధినాయకులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక అంశాలు చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్ఠానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోబోతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి వాటికి సంబంధించిన ఫలాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని.. వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ వివరాలు పంపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ రెండు అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టిపెట్టింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. రాహుల్‌గాంధీని, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలవనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివరాలతోపాటు.. కాంగ్రెస్‌లో జరుగుతున్న ఇతర పరిణామాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.