Telangana Defection Case : ఆ ఇద్దరిపై అనర్హత వేటు వేస్తారా.. క్లీన్ చిట్ ఇస్తారా..?
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. పదిమంది ఎమ్మెల్యేలపై నమోదైన ఈ కేసులో ఇప్పటికీ ఎనిమిది మందికి క్లీన్ చీట్ వచ్చింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ల విషయంలో ఇంకా ఏమీ తేల్చలేదు స్పీకర్ గడ్డం ప్రసాద్. దానం నాగేందర్ విచారణ నిన్న పూర్తయింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన వేర్వేరు పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ చేసి విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కానీ నిన్నటి విచారణలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. విచారణను మళ్లీ వాయిదా వేశారు. కానీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని పక్కా ఆధారాలు ఉన్నాయంటూ కౌశిక్ రెడ్డి వివరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీ ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేశారంటూ వాదించారు కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
వీరిద్దరి తరఫున న్యాయవాదులు దానం నాగేందర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రశ్నించారు. అయితే తాను పార్టీ మారలేదని.. కాంగ్రెస్ లో చేరినట్టు ఎలాంటి అధికారిక సాక్ష్యాలు లేవంటూ దానం నాగేందర్ చెబుతున్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని కేవలం వ్యక్తిగత హోదాలోనే కలిశానని.. అది పార్టీ మారినట్టు కాదంటూ వాదిస్తున్నారు. కానీ దానం నాగేందర్ మిగతా వారిలాగా కాకుండా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడం పెద్ద సమస్యగా మారింది. కాబట్టి అదే అతిపెద్ద ఆధారంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. మరి దాన్ని ఆధారంగా చేసుకుని దానం నాగేందర్ మీద వేటు వేస్తారా లేదా అనేది మరోసారి విచారణలో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ ఉంది. ఆయన కాంగ్రెస్ టికెట్ మీద ఎలాంటి పోటీ చేయలేదు. కానీ ఎంపీ ఎన్నికల్లో తన కూతురు తరఫున కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. అది కూడా ఆయనకు పెద్ద మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడియం శ్రీహరి మీద వేటు వేసేలా చేయాలంటూ మొదటి నుంచి బిఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి ఈరోజు ఆయన మీద తుది నిర్ణయం తీసుకుంటారా లేదంటే మరోసారి విచారణను వాయిదా వేస్తారా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.