Telangana Elections: ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్న పల్లె ఓటర్లు
70.61 శాతం నమోదు;
తెలంగాణలో రానున్న ఐదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. చెదురుమదురు ఘటనలు మినహా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో.. 90.03 శాతం రికార్డయింది.మెదక్ 86.69, జనగామ 85.74, నల్గొండ 85.49, సూర్యాపేట జిల్లాలో 84.83 శాతం ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం, యాకుత్‌పురలో అత్యల్పంగా 39.69 శాతం నమోదైంది. జంట నగరాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు..పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో 73.37 శాతం ఓటింగ్ నమోదైంది.
మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నిక జరగగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్‌లో రాత్రి 8 గంటల వరకూ., షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం గూడూరు, తిమ్మాపూర్‌లలోని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8.30 దాటాక కూడా పోలింగ్ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో..రాత్రి 9న్నర వరకు కొనసాగింది. సాయంత్రం అయిదు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వేచి ఉండటం వల్ల... వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో....సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా, అక్కడ కూడా అప్పటికే క్యూలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు.
కామారెడ్డి, జనగామ, ముథోల్, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో EVMలు మొరాయించగా.. సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్ ఆలస్యమైంది. వరంగల్ తూర్పులో 5 గంటలు దాటిన తర్వాత వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించకపోవటం వల్ల ఓటర్లు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్ లో ఓ పార్టీ ఏజెంట్లు... ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇతర పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడగా చెదరగొట్టే క్రమంలో పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు.
పల్లెల్లో పొద్దంతా పనులు చేసుకుని వచ్చిన ప్రజలు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు రావడం కనిపించింది. యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు బూత్‌లకు ఓటర్లు ఎంసెట్ పరీక్షకు పరుగెత్తినట్లు ఉరుకులు, పరుగులతో వస్తూ కనిపించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత చాలా పార్టీల వారు ఓటర్ల తరలింపు చేపట్టారు. జాబితాను ముందు పెట్టుకుని ఇంకా ఎవరు ఓటుకు రాలేదో ఆరా తీసి వారి కోసం వాహనాలు పంపారు. వ్యాన్లు, ఆటోలు, చివరకు ద్విచక్ర వాహనాలు కూడా పంపి ఓటర్లను తీసుకొచ్చారు.