ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉగాది పండుగ ముందుగానే ఆర్థిక సంతోషాన్ని తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద మూడో విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విడుదల చేయనున్నారు. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ నుంచి సీఎం ప్రారంభించనున్నారు. ఈ చర్య ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్రంలోని దాదాపు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున, మొత్తం సుమారు రూ.2,808 కోట్ల నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన ఖర్చులకు మద్దతు అందించడం లక్ష్యంగా ఈ నిధులు విడుదల చేయబడుతున్నాయి. ఇప్పటికే ఈ పథకం కింద రైతులకు రెండు విడతలుగా రూ.14,000 ఆర్థిక సాయం అందించగా, ఈరోజు జమ చేయనున్న రూ.6,000తో కలిపి సంవత్సరానికి రైతులకు ఇవ్వాల్సిన రూ.20,000 సహాయం పూర్తవుతుంది.
సాగు బలోపేతంపై దృష్టి
వ్యవసాయ రంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు, వారికి స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అదనపు మద్దతుతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. ఈ నిధుల విడుదల కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4.20 గంటలకు సూరంపల్లికి చేరుకోనున్నారు. అనంతరం 4.25 నుంచి 4.55 గంటల వరకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి సమస్యలు, సూచనలు తెలుసుకోనున్నారు. తరువాత సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ప్రజా సభలో సీఎం పాల్గొని రైతులకు ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య రైతాంగానికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, రైతులకు నిరంతర ఆర్థిక మద్దతు అందించడం ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.