TS: కేంద్ర బడ్డెట్‌పై తెలంగాణ భారీ ఆశలు

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఉత్కంఠ... ఇప్పటికే మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన రేవంత్‌రెడ్డి;

Update: 2024-07-21 05:30 GMT

పార్లమెంటులో ఈనెల 23న మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్తగా మరికొన్నింటికి సైతం నిధులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయని ఎదురుచూస్తోంది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్‌ను ఖరారు చేయాలని ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తిస్థాయిలో నిధులు రాక తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రధాని మోదీకి కూడా రేవంత్‌రెడ్డి విన్నవించారు.

ఖమ్మం జిల్లాలో స్టీల్‌ ప్లాంటు స్థాపన... కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతోపాటు కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, ఆధునికీకరణ, డబ్లింగ్‌ వంటి వాటికి కేంద్రం సహయం అందిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంతో పాటు... హైదరాబాద్‌ చుట్టూ రింగ్‌ రోడ్డుకు చేయూత అందిస్తోందని భావిస్తోంది. మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు ఆర్థికసాయంతో పాటు మూసీ రివర్‌ అర్బన్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు సాయం చేయాలని ఇప్పటికే ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేగా పథకానికి అండదండలు అందించాలని కోరిన రేవంత్‌ ప్రభుత్వం దానికి కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులు అందిస్తుందని ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్‌ సమీపంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుతో పాటు ఐటీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ ప్రాజెక్టుకు సమ్మతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుతోపాటు వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం ఎలకుర్తిలో సైనిక్‌ స్కూల్‌ స్థాపనపై కూడా భారీ ఆశలున్నాయి. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు... దీని కోసం కేంద్రాన్ని తెలంగాణ పదేళ్లుగా విన్నవిస్తోంది .

ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు 2023-24 ఆర్థిక సంవత్సరం పద్దు కింద రావాల్సిన రూ.347.54 కోట్లు కేటాయించాలని.. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రాజీవ్‌ రహదారిపై, నాగ్‌పుర్‌ వెళ్లే జాతీయ రహదారిపై నగరం నుంచి ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రేవంత్‌ సర్కార్‌ అడుగుతోంది. హైదరాబాద్‌-కల్వకుర్తి హైవేను నాలుగు వరుసలకు విస్తరించడానికి నిధులు ఇవ్వాలని కోరుతోంది.కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్ఫత్తిలో నిధులను కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ.41,259 కోట్లు వస్తాయని తెలంగాణ అంచనా వేసింది.

Tags:    

Similar News