REVANTH: తెలంగాణలో కొత్త బ్రాండ్లతో బీర్లు
ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష... కీలక నిర్ణయాలు తీసుకున్న సర్కార్;
రాష్ట్రంలో త్వరలోనే కొత్త బ్రాండ్లతో కూడిన బీర్లు అందుబాటులోకి రానున్నాయి. బీర్ల ఉత్పత్తి కోసం మద్యం కంపెనీలను ఆహ్వానించాలని.. దరఖాస్తులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలోపు కంపెనీలను ఖరారు చేసి, మార్చి నుంచే కొత్త బ్రాండ్లు షాపుల్లోకి వచ్చే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదంటూ తెలంగాణలోని ప్రముఖ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ బీర్ల ఉత్పత్తిని నిలిపివేసింది. బీర్ల విక్రయాల్లో ఈ కంపెనీ దాదాపు 70శాతం వాటా కలిగి ఉండటంతో రాష్ట్రంలో త్వరలో బీర్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సంబంధింత అధికారులతో మద్యం ధరల పెంపుపై సమీక్షించారు.
రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలన్నారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని రేవంత్ తెలిపారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలని చెప్పారు.
బీర్ల ధరలు పెరుగుతాయా..?
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. తెలంగాణలో బీర్ల ధరలు పెంచుతారా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. ధరల నిర్ణయ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దాదాపుగా.. బీర్ల ధరలు పెరిగే అవకాశమే కనిపిస్తుండగా.. తక్కువ మోతాదులోనే పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. పాటు త్వరలోనే తెలంగాణలో కొత్త బ్రాండ్లు కూడా కనిపించే అవకాశం ఉంది.