Telangana :మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్
రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం ?
రాష్ట్రంలో హుక్కా కేంద్రాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా ఆర్ధిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో హుక్కా కేంద్రాల మాటున నగరంలో జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని... డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో కీలకంగా మారుతోందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో తాజాగా హుక్కా పార్లర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలకు చేసినప్పుడు.... గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో పాటు పొగాకు ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే యువకుల్లో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్లేవారు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే హుక్కా కేంద్రాలపై నిషేధం విధించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు 500లకు పైనే నడుస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఇవికాకుండా పబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇళ్లల్లో గుట్టుగా కొనసాగేవి భారీగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాల్లో మద్యం పొగాకు ఉత్పత్తులతో పాటువ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీలతో తరచూ వెల్లడవుతోంది. నిబంధనల ప్రకారం... హుక్కా పార్లర్ అనుమతి సమయంలో పేర్కొన్న నిర్దిష్ట గదుల్లోనే నిర్వహించాలి. పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడానికి వీల్లేదు. మైనర్లను అనుమతించకూడదు. నిర్ణీత సమయాలు పాటించాల్సి ఉంటుంది.
నగరంలోని మెజార్టీ హుక్కా కేంద్రాల్లో నిబంధనలు ఏవీ పాటించడం లేదు. మైనర్లను అనుమతించడంతో పాటు విదేశీ సిగరెట్లు అమ్మేస్తున్నారు. కాఫీ క్లబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ల పైభాగంలో కొన్ని నడుస్తున్నాయి. పోలీసులు తనిఖీలకు వెళ్లినప్పుడు కోర్టు ఆర్డర్ ఉందంటూ సాకులు చెప్పడం, రాజకీయ, ఇతర పలుకుబడితో సర్దిచెప్పడం లాంటివి కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యాకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా దృష్టిసారించిన పోలీసు అధికారులు వీటిపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా హుక్కా కేంద్రాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిర్ణయం మాదకద్రవ్యాల నియంత్రణలో ముందడుగులాంటిదని, భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు