TS News: ప్రజాపాలనకువెల్లువెత్తుతున్న దరఖాస్తులు

నేడు, రేపు దరఖాస్తు స్వీకరణకు బ్రేక్

Update: 2023-12-31 04:42 GMT

ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. ఆరు గ్యారెంటీ పథకాల కోసం మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల 57 వేల 592 దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్క రోజే 18 లక్షల 29 వేల 107 అర్జీలు అందాయి. ఐదు గ్యారెంటీలకు చెందినవి 15 లక్షల 88 వేల 720 కాగా.. ఇతర అంశాలకు సంబంధించినవి 2 లక్షల 40 వేల 387 ఉన్నాయి. ఇప్పటివరకు 3 వేల 868 పంచాయితీలు, 8 వేల 697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాని CS శాంతికుమారి తెలిపారు. ఇవాళ, రేపు ప్రభుత్వ సెలవుల కారణంగా.. ప్రజా పాలన సదస్సులకు విరామం ఇచ్చారు. జనవరి 2 నుంచి 6 వరకు తిరిగి సదస్సులు జరగనున్నాయి. 

గ్రేటర్‌లో అభయహస్తం గ్యారంటీలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల్లో దాదాపు 10 లక్షల అర్జీలు అందాయి. LBనగర్ జోన్‌లో 53 వేలు, చార్మినార్‌లో లక్షా 17 వేలు, ఖైరతాబాద్‌లో 74 వేలు, కూకట్‌పల్లిలో 67 వేలు, శేరిలింగంపల్లిలో 38 వేలు, సికింద్రాబాద్‌లో 64 వేలు, కంటోన్మెంట్‌లో 7 వేల దరఖాస్తులు అందాయి. మరోవైపు రేషన్ కార్డుల దరఖాస్తు ఫారం లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసింది. మీసేవా , జిరాక్స్ కేంద్రాల వద్ద నకిలీ దరఖాస్తు ఫారాలు విక్రయిస్తుండటంతో ప్రజలు వాటిని నిజమేనని నమ్మి దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. వాటిని పరిశీలించిన సిబ్బంది ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎలాంటి దరఖాస్తు ఫారాలు ఇవ్వలేదని... కాగితంపై కుటుంబ వివరాలు రాసి ప్రత్యేకంగా అర్జి పెట్టుకోవాలని సూచించారు. GHMC కమిషనర్ రోనాల్డ్‌రాస్‌ నగరంలోని పలు వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రజలకు ఉచితంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు. 

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించిన మంత్రి అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దట్టమైన అడవిలో నివసిస్తున్న గొత్తికోయ గూడానికి స్వయంగా వెళ్లి గిరిజనుల నుంచి సీతక్క దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. 

ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో సదస్సును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తు నింపే విషయంలో అధికారులు ప్రజలకు సహకరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న రేషన్‌ కార్డు దరఖాస్తును ప్రజలు నమ్మొద్దని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు ప్రత్యేక దరఖాస్తు విడుదల చేయలేదని తేల్చిచెప్పారు.


Tags:    

Similar News