Bhatti Vikramarka: బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు
అన్నిశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఉభయసభల ఆమోదం పొందాల్సిఉంది. ఇందుకోసం వచ్చేనెల మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ మేరకుపూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి ఇప్పటికే ఆర్ధికశాఖ ప్రతిపాదనలు కోరింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాలను ఇవ్వాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆయాశాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనలను క్షుణ్నంగా సమీక్షించాలని...ప్రభుత్వప్రాధాన్యత, ఆయా పథకాల కొనసాగింపు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆర్థికశాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని తెలిపింది.
ప్రభుత్వపరంగా చేసిన ముఖ్యమైన ప్రకటనలను దృష్టిలో ఉంచుకోవాలని.. వాటిని సరిపడా నిధులు, తగిన అనుమతులు తీసుకొని ప్రతిపాదించాలని సూచించింది. బడ్జెట్ అంచనాలకు హేతుబద్ధత ఉండాలని తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని..వీలైనన్ని ఎక్కువనిధులు పొందేలా స్పర్ష్ మార్గదర్శకాలకు లోబడి ప్రతిపాదనల తయారీలో చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కేవలం పథకాలకు సంబంధించిన వ్యయప్రతిపాదనలను మాత్రమే ఇవ్వాలన్న ఆర్థికశాఖ... నిర్వహణ వ్యయానికి సంబంధించిన గతంలో ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేటాయింపు చేయనున్నట్లు పేర్కొంది. పథకాలకు సంబంధించిన వ్యయ ప్రతిపాదనలను ఆయా శాఖల ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్థికశాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ విధానంలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయాశాఖల సచివాలయ పరిపాలనా విభాగాలు ఆ ప్రతిపాదనలు పరిశీలించి, అభిప్రాయాలతో 18వరకు ఆర్థికశాఖకు పంపాల్సి ఉంటుంది. అదే రోజు నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉపముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్కఆ రోజు నుంచి సమావేశం కానున్నారు.
ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖల సమావేశం ఉంటుంది. 22న ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రతిపాదనలపై చర్చ ఉంటుంది. నీటిపారుదల, పౌరసరఫరాలు, అటవీ, దేవాదాయశాఖల సమావేశం 26వ తేదీన జరుగుతుంది. 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటకశాఖల ప్రతిపాదనలపై సమాలోచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు చెందిన ప్రతిపాదనలపై ఆయాశాఖల ఉన్నతాధికారులతో 28 నుంచి వచ్చే నెల ఒకటి వరకు చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలకు అవసరమయ్యే నిధులు, వాటికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా తయారు చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు స్పష్టం చేశారు.