Telangana Rains : మళ్లీ కుండపోత వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
Telangana Rains : నాలుగు రోజులుగా తెరిపినిచ్చిన వర్షాలు.. మళ్లీ విజృంభిస్తున్నాయి.;
Telangana Rains : నాలుగు రోజులుగా తెరిపినిచ్చిన వర్షాలు.. మళ్లీ విజృంభిస్తున్నాయి. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలవుతున్నాయి. ఇవాళ కూడా వాన తెరిపి ఇవ్వకుపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఊరూ వాగూ ఏకమయ్యాయి. చాలా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రహదారులు తెగిపోవడంతో పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వరద నీరు భారీగా చేరుతుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదలు, వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాజెక్ట్ నీటిమట్టాలపైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకుని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో జనజీవనం స్థంభించిపోయింది. ముగ్గురు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆటోనగర్ దగ్గర మెదక్- హైదరాబాద్ రహదారి జలమయం అయింది. హవేళి ఘనపూర్ మండలంలోని దేవుని చెరువు ప్రమాదకర స్థాయికి చేరింది. గాజులవాయి తండా- కొచ్చెరువు తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నశంకరంపేట మండలం రుద్రారం-చందంపేట్ మధ్య కల్వర్టు పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.
ఏడుపాయల వనదుర్గా దేవి అమ్మవారి ఆలయాన్ని వరద నీరు చెత్తింది.. దీంతో గర్భాలయాన్ని అధికారులు మూసివేశారు. చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది.. భారీ వర్షాలకు ఓ ఫ్యాక్టరీ గోడ కూలి ఇంటిపై పడటంతో ఇద్దరు మృతిచెందారు. నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. సంగారెడ్డి జిల్లాలో గోపులారం చెరువుకు గండి పడింది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రైల్వేలైన్ కోసం నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జ్ వద్దకు నీరు చేరడంతో మనోహరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు సింగూరుకు భారీ వరద వస్తోంది. దీంతో మూడు గేట్ల ద్వార దాదాపు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన మంజీరా ప్రాజెక్టు గేట్టు కూడా ఓపెన్ చేయడంతో నిజాంసాగర్‌కు వరద పరవళ్లు తొక్కుతోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెక్ డ్యామ్‌ల దగ్గర వరద ఉధృతి నెలకొంది, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో లెండి వాగు ఉగ్రరూపం దాల్చింది.. మద్నూరు మండలంల గోజేగావ్ వద్ద లో లెవెల్ బ్రిడ్జి నీటమునిగింది.. బ్రిడ్జి పైనుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కామారెడ్డి-పిట్ల మండలం తిమ్మానగర్ వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. నల్లవాగు ఉధృతికి జుక్కల మండలం బాబాల్ గావ్, సవాల్ గావ్ ప్రాంతాలకు రవాణా స్తంభించింది.. ఎల్లారెడ్డి, లింగంపేట్ వాగులకు నీటి ప్రవాహం మరింత పెరిగింది.. చాలా చోట్ల పంటలు నీటమునిగాయి.. ఇక శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కౌలాస్ నాలా, పోచారం ప్రాజెక్టులకు మరోసారి వరద పోటెత్తింది. కల్యాణి ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. లోయర్ మానేర్ డ్యాం 4గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో పరివహాక ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ సమీపంలో సింగ సముద్రం కొత్త అందాలను సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు సింగసముద్రం నిండి అలుగు పారుతోంది. పాత్తైన ఆనకట్ట మీదుగా వరద పరవళ్లు తొక్కుతూ... జలపాతం కిందకి దూకుతోంది. చుట్టూ ఎత్తైన కొండలు, చెట్లతో నిండి ఉండటంతో పాటు మధ్యలో సింగ సముద్రం నిలకడగా కనిపిస్తూ.. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
భారీ వర్షాలకు వరంగల్ జిల్లా తడిసిమద్దవుతుంది. వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరడంతో ఖనాపూర్ మండలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.పాకాల సరస్సు మత్తడి పోస్తుండటంతో నర్సంపేట నుండి కొత్తగూడ,గంగారం మండలాల మీదగా భద్రాచలం వెళ్లే మార్గాన్ని మూసివేశారు అధికారులు. భారీవర్షాలకు వరంగల్ మండి బజారులో ఇల్లు కూలి ఇద్దరు మరణించారు. వెంకటాపురం మండలం ముత్తారం వద్ద గిరిజనులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ వాగులో చిక్కుకపోయింది. ఎట్టకేలకు వాగునుంచి ట్రాక్టర్ బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
భారీ వర్షాలు, ముంపు ముప్పు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంకా బయటపడడం లేదు. చాలా చోట్ల వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హత్నూర్ మండల కేంద్రంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో లోలెవెల్ వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి కడుతున్నారు. తాత్కాలికంగా దీని పక్క నుంచి అప్రోచ్ రోడ్డు మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవలి వర్షాలకు అది కొట్టుకుపోవడంతో అటువైపు ఉన్న 35 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతె మండలం ఉర్లుగొండ-నర్సింహాపురంతోపాటు కోదాడ మండలం గొండ్రియాల మధ్య పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మునగాల మండలం తాడ్వాయి వాగు డేంజర్ లెవల్‌లో ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే వాతావరణ శాఖ సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాలకు రెండ్ అలర్ట్ జారీచేసింది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు కాపాడారు.
గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది.రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా రెండు అడుగులు పెరిగి ఇరువైఐదుఅడుగులకు చేరుకుంది.ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇరవైఆరు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ఫాలింగ్ గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ములకలపల్లి మండలం సీతారామపురం పంచాయతీ పరిధిలోని సుబ్బన్నగూడెం, అన్నారం మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.మండలంలోని ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.. కమలాపురంలోని పెద్దయ్య చెరువు అలుగు పొంగడంతో ఆ నీరంతా రహదారిపైకి పోటెత్తింది.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువన ఛత్తీస్‌ఘడ్‌లో కురుస్తున్న వర్షాలకు తోడు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు అడుగుమేర ఎత్తి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతీ రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటంతో పాటు... ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది.