HYDRA : హైడ్రాపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

Update: 2024-09-14 04:45 GMT

స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా దూకుడు ప్రదర్శిస్తూ, కూల్చివేతలకు 'హైడ్రా' పాల్పడుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారా? అంటూ హైడ్రాను ప్రశ్నించింది.

జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్ పూర్ లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూల్చి వేశారని పిటిషనర్లు తెలిపారు. చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తమ ఆదేశాలంటే లెక్క లేదా అంటూ హైడ్రాపై సీరియస్ అయింది.

Tags:    

Similar News