TG: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్
లబ్ధిదారుల జాబితా ప్రకటించడమే మిగిలిందన్న మంత్రి... త్వరలో అందుబాటులోకి ప్రత్యేక యాప్;
తెలంగాణలోని నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ రెవెన్యూ, గహ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మరో అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి సర్వం సిద్ధమైందని.. ఇక లబ్దిదారుల జాబితాను ప్రకటించటమే మిగిలిందంటూ.. గత కొంతకాలంగా చెప్తూ వస్తున్న మంత్రి పొంగులేటి.. మరో కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. యాప్‌ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. యాప్‌లో తెలుగు వెర్షన్ కూడా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు మరోసారి తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు.
ఎన్నికల హామీల అమలు మేరకు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలందరికి సొంతింటి కలను సాకారం చేయాలన్న ధ్యేయంతో.. అర్హులైనవారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖాళీ స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక.. ఖాళీ స్థలం లేనివారికి స్థలంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని.. ఆశావాహులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
కులగణనకు ఇంటింటి సర్వే
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. తెలంగాణలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు పొంగులేటి వివరించారు.