TG: కృష్ణా జలాల్లో చట్టబద్ధమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోండి

అధికారులకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం;

Update: 2024-06-17 03:30 GMT

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చట్టబద్ధమైన వాటా దక్కాలన్న తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, అధికారులకు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని తెలిపారు. నీటిపారుదలశాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునళ్లలో ఉన్న అంశాలపై మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదీ జలవివాదాల రెండో ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో ఉన్న వివిధ అంశాల పరిస్థితి, ముందుకెళ్లాల్సిన మార్గాలను సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరించారు. 2015లో ఏపీతో కృష్ణా జలాల విషయంలో కేవలం ఆ ఏడాదికి మాత్రమే అడ్‌హక్‌ పద్ధతిన అంగీకారం కుదిరినట్లు చెప్పారు.



కృష్ణా జలాల్లో సగం వాటా కోసం తీర్పు వచ్చే వరకు ట్రైబ్యునల్ ముందు ప్రయత్నించాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని మరోమారు స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో శాసనసభలోనే తీర్మానం చేసినట్లు తెలిపారు. కృష్ణా జలాల వాటా, ప్రజల ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్ అవార్డు అంశాన్ని... మహారాష్ట్ర, కర్నాటకతో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మేలని వైద్యనాథన్ సూచించారు. ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... మహారాష్ట్ర, కర్నాటకతో చర్చల ద్వారా పరిష్కారానికి అనుమతి ఇచ్చారు.

ఘోష్‌ కమిటి విచారణ...

ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా... అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంత ఇంజనీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న... జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమై కీలక విషయాలు రాబట్టారు. 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను.. విశ్రాంత ఇంజనీర్ల కమిటీ సభ్యులు కమిషన్‌కు వివరించారు. ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, గోదావరి జలాల లభ్యత, కేంద్ర జలసంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డను ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా అప్పటి CM సూచించారని... విశ్రాంత ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసింది. తమ నివేదికపై అప్పటి సీఎం, మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు పేర్కొన్నట్లు తెలిసింది. అటు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టిసారించిన జస్టిస్ ఘోష్ వారి వివరాలు సేకరిస్తోంది. ఆయా నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయని కమిషన్‌ భావిస్తోంది. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తైనందున.. అన్ని అఫిడవిట్లు వచ్చిన తర్వాత .కమిషన్ తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.

Tags:    

Similar News