Telangana News : ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. ఆ ముగ్గురి పరిస్థితేంటి..?

Update: 2026-01-16 05:30 GMT

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో నేడు మరో ఇద్దరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో 10 మంది ఎమ్మెల్యేలు చేరారని.. వారిపై అనర్హత వేయాలంటూ గతంలో బీఆర్ ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని శాసన సభ స్పీకర్ కే వదిలేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వారు కాంగ్రెస్ లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవని.. వారంతా బీఆర్ ఎస్ లోనే ఉన్నారంటూ స్పష్టం చేశారు. ఇక నేడు మాజీ మంత్రి, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలకు శాసన సభ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిద్దరు కూడా కాంగ్రెస్ లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.

దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు అనర్హత నుంచి బయటపడ్డారు. ఇక ముగ్గురి విషయం తేలాల్సి ఉంది. అందులో చూసుకుంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ల విషయంలో స్పీకర్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. కడియం శ్రీహరి, దానంలపై అనర్హత తప్పదని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరు కూడా అవసరం అయితే రాజీనామాలకు సిద్ధం అంటూ పలుమార్లు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ మాట మార్చేసి.. తాము కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో చేరలేదన్నట్టు మాట్లాడుతున్నారు.

వీరిద్దరి అఫిడవిట్లపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. త్వరలోనే దాని మీద క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ ముగ్గురికి కూడా క్లీన్ చిట్ ఇస్తారా లేదా అనేది తెలియాలి. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ మీదనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఆయన కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పడానికి వీల్లేకుండా పోయింది. మరి ఆయన ఒక్కడిపై ఏమైనా వేటు వేసి మిగతా ఇద్దరికీ క్లీన్ చిట్ ఇస్తారా లేదా అనేది తెలియాలి.

Tags:    

Similar News