Telangana Municipal Elections : తుది అంకానికి మున్సిపల్ పోరు.. తీవ్రస్థాయిలో ఆరోపణలు..
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచారం ముగియబోతోంది. దీంతో గత రెండు రోజులుగా పార్టీలు తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేపదే బీఆర్ఎస్ ను, బిజెపిని టార్గెట్ చేస్తూ.. ఆ రెండు పార్టీలు ఒకటే అని.. అందుకే కాలేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ చేయట్లేదు అంటూ ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ కేసులో, ఈ కార్ రేసులో ఎందుకు సిబిఐ విచారణ చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. బిజెపి కావాలనే కేసీఆర్ ను, కేటీఆర్ ను కాపాడుతోందని.. ఆ రెండు పార్టీలను ఓడించి కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కెసిఆర్, మోడీని చూసి ఓటేయాలని ఆ రెండు పార్టీలు అడుగుతున్నాయని.. గల్లీలో సమస్యల కోసం కెసిఆర్, మోడీ దిగి వస్తారా అంటూ రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి.. హస్తం గుర్తు అభ్యర్థులనే గెలిపిస్తే అభివృద్ధి ఈజీ అవుతుందని చెబుతున్నారు.
అటు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారని.. రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంచారంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. రాబోయే రెండున్నరేళ్లలో మళ్ళీ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని.. కాబట్టి కారు అభ్యర్థులను గెలిపిస్తే అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామంటూ చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో తీవ్రస్థాయిలో స్కాములు చేస్తున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి తన బినామీల కంపెనీలకే వేలకోట్ల కాంట్రాక్టులు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. బిజెపికి ఓటు వేస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని.. కాబట్టి కారు గుర్తుపై ఓటేసి మెజార్టీ సీట్లను గెలిపించాలని కోరుతున్నారు.
ఇంకోవైపు బిజెపి నేతలు కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు తమకు అప్పగించిన ఎన్నికల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో తిరుగుతూ బాగానే కష్టపడుతున్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకటే అని.. ఆ రెండు పార్టీల్లో దేన్ని గెలిపించినా అభివృద్ధి పెద్దగా జరగదని.. ఇప్పటివరకు మునిసిపాలిటీలకు వస్తున్న నిధులు అన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు కమలం పార్టీ అభ్యర్థులను పెద్ద స్థాయిలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే గెలిపిస్తామంటూ ఎంపీలు చెప్పడం ఇక్కడ కోసమెరుపు. ఇలా అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కోరేదిస్తున్నారు. మరి ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారు అనేది చూడాలి.