తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న 116 మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికలు మరీ ముఖ్యంగా ముగ్గురు నాయకులకు పెద్ద సవాల్ విసురుతున్నాయి. ఆ ముగ్గురు తమ నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఇదే ఎన్నిక సరైన అవకాశం అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు సాధించకపోతే సొంత పార్టీలోనే వారి నాయకత్వంపై తీవ్రమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరో కాదు సీఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామ్ చందర్ రావు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు ఉప ఎన్నికలు జరిగినా.. వాటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా.. ఈ మున్సిపల్ ఎన్నికలు పెద్ద సవాల్ నే విసురుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులపై జరుగుతున్న పెద్ద ఎన్నికలు ఇవే. పైగా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పాటు బిజెపి బలమైన పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది కాబట్టి.. ఎక్కువ సీట్లు సాధించకపోతే అది రేవంత్ ఇమేజ్ కు డ్యామేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. పైగా మొన్న రెండు ఉప ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఈసారి బలమైన సీట్లు సాధించకపోతే గులాబీ పార్టీలో కేటీఆర్ నాయకత్వం మీదనే అనుమానాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలకు కూడా దూరంగానే ఉంటున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు కేటీఆర్ చేతిలోనే పెట్టారు. కాబట్టి ఈ ఎన్నికలు కేటీఆర్ తన నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేటీఆర్ సత్తా ఏంటో తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.
అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు నాయకత్వంలో పార్టీ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. రెండు ఉప ఎన్నికల్లో ఎలాంటి పోటీ ఇవ్వలేదు. ఇక మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అయితే మరీ దారుణంగా సీట్లు వచ్చాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని పదే పదే చెబుతున్న రామ్ చందర్ రావు.. అర్బన్ లో తమ పట్టు నిరూపించుకునే పరిస్థితి వచ్చింది. ఈసారి గనక బిజెపి అనుకున్న స్థాయిలో సీటు సాధించకపోతే ఆ ఎఫెక్ట్ రామ్ చందర్ రావు మీదనే పడే ప్రమాదం ఉంది. ఇలా మూడు పార్టీల్లో ముగ్గురు బలమైన నాయకులకు ఎన్నికలు సవాల్ విసిరుతున్నాయి. మరి ఎవరి నాయకత్వం నెగ్గుతుందో వేచి చూడాలి.