తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు గట్టి సవాల్ విసురుతున్నాయి. మనం పంచాయతీ ఎన్నికలను ఒకసారి గమనిస్తే.. అందులో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు ఎగరేసుకుపోయింది. బీఆర్ఎస్ ఆ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే సీట్లే వచ్చాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ మాత్రం సీట్లు రావడం పర్వాలేదు అనే అంశమే. ఇక బిజెపికి మాత్రం అత్యంత దారుణంగా సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలను కమలం పార్టీ నేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గ్రామాల్లో తమకు పట్టు లేదు అని ముందే ప్రకటించి.. లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను మాత్రం మూడు పార్టీలు గట్టిగానే తీసుకున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి పెద్దగా ప్రచారం చేయకపోయినా.. కాంగ్రెస్ నేతలు బలంగానే పోరాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ సీట్లు సాధించారు. బిజెపి ప్రచారం చేయకపోవడం, బిఆర్ఎస్ నేతలు పట్టించుకోకపోవడం కాంగ్రెస్ కు ఎక్కువగా కలిసి వచ్చింది.
కానీ ఈసారి మాత్రం గులాబీ పార్టీ నేతలు, కమలం పార్టీ నేతలు ఢీ అంటే ఢీ అంటూ దూసుకుపోతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఈసారి గట్టి పోటీనే ఎదురవుతోంది. పైగా మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉండటం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి పార్టీ గుర్తుపై జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు కావడంతో ఈ మున్సిపల్ పోరు కాంగ్రెస్ కు గట్టి సవాల్ గా మారింది. అటు బిఆర్ఎస్ పార్టీ వరుసగా ఉప ఎన్నికల్లో ఓడిపోతు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించి తమ గ్రాఫ్ పెరిగింది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు.
దీంతో కేటీఆర్, హరీష్ రావు ఎన్నికలలో కీలకంగా వ్యవహరిస్తూ అన్నీ చూసుకుంటున్నారు. అటు బీజేపీ నేతలు ఎవరికీ అప్పగించిన స్థానాల్లో వారు బలంగా ప్రచారాలు చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు అందరినీ సమన్వయ పరుస్తూ.. ప్రచారంలో ముందు ఉంచుతున్నారు. ఇలా మూడు పార్టీలు ఒకరికి ఒకరు పోటీ ఇస్తూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక ఒకరిపై ఒకరు ఎలాంటి సంచలన ఆరోపణలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఎన్నికలు ఎవరి గ్రాఫ్ పెంచుతాయో.. ఎవరిని తగ్గిస్తాయో చూడాలి.