తెలంగాణలో మునిసిపల్ వార్ హీటెక్కింది. మూడు పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ దూసుకుపోతున్నాయి. నిన్న మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంది ఫోన్లు వినే వ్యక్తి జాతిపిత ఎలా అవుతారు అంటూ ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ పదేళ్ల అధికారంలో నిరుపేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేశారని.. పేద విద్యార్థులకు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వేధించారని.. అలాంటి కెసిఆర్ జాతిపిత ఎలా అవుతారు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంగా పనిచేసిన కేసీఆర్ ను పట్టుకుని అలా ఎలా అంటారు అని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటం చేసిన మహాత్మా గాంధీ దేశానికి జాతిపిత అయినప్పుడు.. పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ కూడా రాష్ట్రానికి జాతిపితనే అవుతారని వాళ్ళిద్దరూ చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలకు వేలకోట్ల కాంట్రాక్టులు దక్కుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని.. అలాంటి పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి అంటూ సూచిస్తున్నారు కేటీఆర్.
ఇంకోవైపు బిజెపి కూడా గట్టిగానే ప్రచారం చేస్తుంది. మునిసిపల్ ఎన్నికల ఇన్చార్జిలు వాళ్లకు అప్పగించిన బాధ్యతల్లో బిజీగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఈసారి మెజార్టీ సీట్లు సాధించి రాష్ట్రంలో కమలం పార్టీ గ్రాఫ్ పెరిగింది అని నిరూపించుకోవాలని చూస్తున్నారు కమలనాధులు. గతంతో పోలిస్తే ఈసారి బిజెపి నేతలు కాస్త ఎక్కువగానే ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులపై జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే.. ఆ ఎఫెక్ట్ రాబోయే అన్ని ఎలక్షన్లపై ఉంటుందనేది మూడు పార్టీల భావన. అందుకే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరి ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తారనేది వేచి చూడాలి.