Telangana Municipal Polls : వ్యక్తిగత విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల తీరు..

Update: 2026-02-08 11:15 GMT

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు మరింత వేడెక్కిపోయాయి. ఇవి ఎక్కడిదాకా వెళ్లాయంటే ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేసుకునేదాకా. మూడు పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ దూసుకుపోతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావుల మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ స్కాములు చేసి తెలంగాణను సర్వనాశనం చేశాడని.. అలాంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత ఎలా అవుతారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. మంది ఫోన్లు వినే వ్యక్తికి జాతిపిత అనిపించుకునే అర్హత లేదంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావులు కూడా ఇదే స్థాయిలో జవాబు ఇస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి టీపీసీసీ చీఫ్ పదవిని కొనుక్కున్నారని.. ఇప్పుడు సీఎం పదవి కూడా అడ్డ దారిలో సంపాదించాడంటూ విమర్శిస్తున్నారు. సింగరేణిలో సీఎం రేవంత్ అల్లుడి కంపెనీకే పెద్ద ఎత్తున కాంట్రాక్టులు వస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇలా ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలోనే జరుగుతున్నట్టు ఇద్దరు మాజీ మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే అటు బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ ఎస్ పై విరుచుకుపడుతోంది. కేసీఆర్, సీఎం రేవంత్ ఇద్దరూ ఒకటే అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ అంటోంది. ఇలా ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దిగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే.. దాని గ్రాఫ్‌ పెరిగినట్టు ప్రజలు భావిస్తారనేది వారి అంచనా. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులపై జరుగుతున్న అతిపెద్ద ఎన్నిక కావడంతో తీవ్ర స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు మూడు పార్టీల నేతలు.

Tags:    

Similar News