హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో ఆర్‌అండ్‌బీ టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. రెండేండ్లల్లో హైకోర్టు నిర్మాణం పూర్తి చేసేలా.. టెండర్ దక్కించుకున్న కంపెనీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించనుందని అధికారులు చెబుతున్నారు. కొత్త హైకోర్టు భవనంలో జడ్జిలకు నివాస భవనాలు, బార్ కౌన్సిల్ ఆఫీసు, అడ్వకేట్లకు లైబ్రరీ, పోలీసు, సెక్యూరిటీ సిబ్బిందితో పాటు మొత్తం 40 బిల్డింగులు నిర్మించనున్నారు. అన్ని పరిశీలనల తర్వాత ఫైనల్ డిజైన్ ఖరారు చేశారు. ప్రస్తుత హైకోర్టు వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఉంటుండంతో జడ్జీలు, లాయర్లు, పబ్లిక్ కోర్టుకు రావటం పెద్ద సమస్యగా మారింది. గతంలోనే కొత్త హైకోర్టు నిర్మించాలని అనుకోగా ఇప్పుడు ముందుకు పడిందని లాయర్లు చెబుతున్నారు.